పవన్, లోకేష్ లు ఎప్పుడైనా పరామర్శించారా?

Tuesday, December 29th, 2020, 07:32:26 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రతి పక్ష పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత తెలుగు దేశం పార్టీ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించిన దాఖలు లేవు అని, అధికారం కోల్పోగానే రైతుల పై కపట ప్రేమ చూపిస్తూ ముసలి కన్నీరు కారుస్తున్నారు అంటూ మంత్రి కన్నబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పడు, గతంలో రైతు కుటుంబాలను పవన్, లోకేష్ ఎప్పుడైనా పరామర్శించారా అంటూ మంత్రి సూటిగా ప్రశ్నించారు. అయితే తెలుగు దేశం పార్టీ హయాంలో రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకున్నామని మంత్రి వ్యాఖ్యానించారు.

అయితే గత టీడీపీ పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న 480 మంది రైతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించామని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం టీడీపీ వ్యవహరిస్తున్న తీరు పట్ల మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగు దేశం పార్టీ ఒక డ్రామా కంపెనీ అంటూ విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజల సొంతింటి కలను నిజం చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ లు పడుతున్న తిప్పలు చూస్తే జాలేస్తుంది అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి.