ప్రజలు అతడిని కమెడియన్ లా చూస్తున్నారు – మంత్రి కన్నబాబు

Monday, April 12th, 2021, 08:30:48 AM IST

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నేపథ్యం లో అధికార, ప్రతి పక్ష పార్టీ లు ఒకరి పై మరొకరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మేరకు మీడియా సమావేశం ద్వారా మాట్లాడిన మంత్రి కురసాల కన్నబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, టీడీపీ, జన సేన పార్టీ లకు తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో ఓటు అడిగే హక్కు లేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే 2014 లో తిరుపతి లో నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని, విభజన చట్టాన్ని నెరవేరుస్తామని, 10 ఏళ్ల నుండి 15 ఏళ్ల వరకు ప్రత్యేక హోదా పొడిగిస్తామని చేసిన వ్యాఖ్యలను మంత్రి గుర్తు చేశారు. అదే వేదిక పై పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు అని, అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు కర్మాగారం ను బీజేపీ విక్రయానికి పెట్టింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే 2014 నుండి 2019 వరకు అధికారం లో ఉన్నటువంటి తెలుగు దేశం పార్టీ ప్రత్యేక హోదా ను సాధించలేక ప్రత్యేక ప్యాకేజి తో సరిపెట్టుకుంది అంటూ విమర్శించారు. ఆ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదని, తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో సామాన్య కార్యకర్త, నిరుపేద దళితుడు అయిన డాక్టర్ గురుమూర్తికి ఎంపీ టికెట్ ఇచ్చి సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. అయితే వైసీపీ అభ్యర్ధి గెలుపు పై ధీమా వ్యక్తం చేశారు. అయితే ఆలయాల ధ్వంసం కేసులో టీడీపీ హస్తం ఉన్నప్పటికీ బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు అంటూ సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారం లో లోకేష్ సీఎం జగన్ పై వరుస విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదంతా వారి అనుకూల మీడియా లో లోకేష్ ను హీరో చేయాలనుకుంటున్నారు అని విమర్శించారు. అయితే ప్రజలు మాత్రం అతడిని కమెడియన్ లా చూస్తున్నారు అంటూ సెటైర్స్ వేశారు.