నిన్నటి వరకు పవన్ బాబు బాటలోనే…నేడు?

Thursday, September 10th, 2020, 05:30:05 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న తాజా పరిణామాల పై విపక్షాలు వరుస విమర్శలు చేస్తూనే ఉన్నాయి. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రథం దగ్ధం ఘటన పై టీడీపీ, జన సేన, బీజేపీ లు అధికార పార్టీ తీరు ను ఎండగడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ అంతర్వేది రథం దగ్ధం ఘటన విషయం లో ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పందించింది అని మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు.

అయితే ఈ ఘటన విషయం లో ఎవరిని కూడా ఉపే క్షించాల్సిన అవసరం లేదు అని, అయితే చంద్రబాబు నాయుడు లాంటి వారు రాజకీయాలకు వాడుకుంటున్నారు అని, నిన్నటి వరకు కుల రాజకీయాలు చేసి, నేడు మత రాజకీయాలు చేస్తున్నారు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పందించడం మాత్రమే కాకుండా, అధికారులను సస్పెండ్ చేసి, విచారణ జరుపుతూ నే, రథం ఏర్పాటు కోసం నిధులను కేటాయించిన విషయాన్ని మంత్రి వెల్లడించారు.

అయితే చంద్రబాబు నాయుడు పాలన లో గోదావరి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలను కోల్పోతే, ఎవరి పై చర్యలు తీసుకున్నారు అని సూటిగా ప్రశ్నించారు. అంతేకాక ఆలయాల కూల్చివేత, స్వామీజీ ల అరెస్ట్ వ్యవహారాల పై మంత్రి ఘాటు విమర్శలు చేశారు. అయితే నిన్నటి వరకూ పవన్ కళ్యాణ్ బాబు బాటలో నడిచారు అని, నేడు బీజేపీ బాటలో నడుస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. ప్రభుత్వం ఎక్కడా కూడా లోపం లేకుండా విచారణ చేస్తోంది అని, మత రాజకీయాలు చేసే వారి ఆశలు నెరవేరవు అంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.