కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పై పవన్, బీజేపీ నేతలు స్పందించాలి – మంత్రి అవంతి శ్రీనివాస్

Sunday, February 7th, 2021, 05:06:25 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దురదృష్టకరం అని అన్నారు. ఎవరితో సంప్రదించకుండా ఏక పక్ష నిర్ణయం తీసుకున్నారు అని, కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అయితే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పిస్తుంది అని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము పై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ నేతలు స్పందించాలి అంటూ చెప్పుకొచ్చారు.

ప్రతి పక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడు పై సైతం ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆపాలి అని, ఆయనకు ధైర్యం ఉంటే మోడీ కి లేఖ రాయాలని అన్నారు. అయితే 32 మంది ప్రాణ త్యాగం తో విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పడింది అని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై టీడీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తుత్తి రాజీనామా లతో ఒరిగేదేమీ లేదు అని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఎలాంటి పోరాటానికి అయిన సిద్దం అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తి నెలకొంది.