వ్యవసాయం దండగ అన్న బాబుకి, సీఎం జగన్ కి చాలా వ్యత్యాసం ఉంది

Tuesday, December 8th, 2020, 07:35:15 AM IST

అధికారం లో ఉండగా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను పట్టించుకోలేదు అని, ఇప్పుడు మాట్లాడుతుంటే విడ్డూరం గా ఉంది అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే రైతు కుటుంబం లో పుట్టి, వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు కి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి చాలా వ్యత్యాసం ఉంది అని అన్నారు. టీడీపీ రైతుల్ని మోసం చేస్తే మానవీయ కోణంలో ఆలోచిస్తూ ఉదారంగా వ్యవహరిస్తున్న పార్టీ తమది అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

అయితే నివర్ తుఫాన్, భారీ వర్షాల కారణంగా రైతులు నష్టపోయారు అని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తమ పై ఉంది అంటూ స్పష్టం చేశారు. అయితే పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు అంతా కూడా జిల్లా అభివృద్ధి పైదృష్టి పెట్టాలి అని అన్నారు. పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ 10 వ తేదీ కల్లా పూర్తి చేయాలి అని, ప్రతి రోజూ వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ లు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా చూడాలి అని అన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలి అని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాల వలన ఏర్పడ్డ సమస్యల పై దృష్టి సారించాలి అని తెలిపారు.