ఇప్పటికైనా తోక పార్టీలు బుద్ది తెచ్చుకోవాలి – ఏపీ మంత్రి!

Saturday, August 1st, 2020, 03:01:24 AM IST


తెలుగు దేశం పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా ఆఖరికి న్యాయమే గెలిచింది అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. గవర్నర్ అయిదు కోట్ల మంది ప్రజల అభీష్టానికు అనుగుణంగా అన్నీ ప్రాంతాల అభివృద్ధికి ఆమోద ముద్ర వేశారు అని అన్నారు. అయితే ఇప్పటికైనా తోక పార్టీలు బుద్ది తెచ్చుకోవాలి అంటూ ఘాటు విమర్శలు చేశారు. 13 జిల్లాలను కూడా సమానంగా అభివృద్ది చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం అని అన్నారు.

అయితే ప్రత్యేక కమిటీలు మాత్రం ప్రజల అభిప్రాయం సేకరించిన తర్వాత అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని చెప్పిన విషయాన్ని వెల్లడించారు. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతి పక్ష నేత స్వప్రయోజనాల కోసం అన్ని ప్రాంతాల అభివృద్ధి ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు అని, వ్యవస్థలను అడ్డుపెట్టుకొని బిల్లులను అడ్డుకోవాలని చూశారు అని సంచలన ఆరోపణలు చేశారు.అయితే శాసన మండలి లో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థ ను అపహస్యం చేసేలా వ్యవహరించారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.