టీడీపీ కి డిపాజిట్లు వచ్చే పరిస్థతి లేదు

Thursday, January 7th, 2021, 03:21:26 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వైసీపీ నేతలు, మంత్రులు జగన్ పాలన విధానంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదే విధంగా టీడీపీ పై వరుస విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇళ్ళ స్థలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అవంతి శ్రీనివాస్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి పేదవాడి కి ఇళ్లు ఉండాలి అనేదే సీఎం జగన్ లక్ష్యం అని అన్నారు. ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ లా జరుగుతుంది అని అవంతి శ్రీనివాస్ అన్నారు.

ఒక్క పైగా అవినీతి లేకుండా ఇళ్ళ పట్టాల పంపిణీ జరుగుతుంది అని, చంద్రబాబు నాయుడు మంచి కార్యక్రమాలు చేయడు, చేసేవారికి అడ్డు పడతాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలకు అతీతంగా ఇళ్ళ పట్టాల పంపిణీ ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబు నాయుడు మత రాజకీయాలు చేస్తున్నారు అని, మతానికి రాజకీయ రంగు పులుముతున్న వ్యక్తి చంద్రబాబు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 40 దేవాలయాలను పడగొట్టిన చంద్రబాబు, దేవాలయాల గురించి మాట్లాడే హక్కు లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ త్వరలోనే కనుమరుగు అవుతుంది అని, టీడీపీ కి డిపాజిట్లు కూడా రావు అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.