చంద్రబాబు పై మంత్రి బొత్స ఫైర్…అడ్డదారిలో స్టేలు తెచ్చుకోవడమేంటి?

Tuesday, March 16th, 2021, 04:37:03 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి లో భూ కుంభకోణం జరిగింది అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి సీఐడీ నేడు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు ఈ వ్యవహారం లో అనుసరిస్తున్న వైఖరి పట్ల వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. అమరావతి లో దళితుల భూములను ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిపి చంద్రబాబు కాజేశారు అని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. చంద్రబాబు కి చిత్త శుద్ధి ఉంటే విచారణ ఎదుర్కోవాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ ప్రతిపక్షం లో ఉన్నప్పటి నుండి అమరావతి భూ కుంభకోణం పై ప్రశ్నిస్తూనే ఉందని పేర్కొన్నారు.

చంద్రబాబు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరపనట్లైతే విచారణ ఎదుర్కోవాలి కానీ, కోర్టులకు వెళ్లి అడ్డదారిలో స్టే లు తెచ్చుకోవడం ఏమిటి అంటూ నిలదీశారు. చంద్రబాబు అధికార పార్టీ వైసీపీ పై చేసిన ఆరోపణలను మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. తాము అధికారం లోకి వచ్చి రెండేళ్లు అయింది అని, అయితే తమను ఎందుకు ప్రశ్నించడం లేదు అని వ్యాఖ్యానించారు. ప్రజల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే దళితులకు అన్యాయం జరిగితే ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు అని, కేవలం దళితుడే కావాల్సిన అవసరం లేదు అని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు.