విశాఖ లో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వకుండా టీడీపీ కోర్టుకెళ్ళింది – మంత్రి బొత్స

Monday, March 8th, 2021, 07:37:19 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత చంద్రబాబు పాలన అంతా దోపిడీ యే అంటూ విమర్శించారు. విశాఖ వచ్చి ఆయన ఏదేదో మాట్లాడారు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలన లో పేదవాడికి ఒక్క ఇళ్లైనా ఇచ్చారా అంటూ సూటిగా ప్రశ్నించారు. హుద్ హూద్ తుఫాన్ వస్తే విశాఖ లో భూ రికార్డులు తారుమారు అయ్యాయని, భూ రికార్డుల తారుమారు పై అప్పటి మంత్రులు ఒకరి పై మరొకరు విమర్శలు చేసుకున్నారు అని మంత్రి తెలిపారు. వైఎస్సార్ హయాంలో నే విశాఖ అభివృద్ధి చెందింది అని వ్యాఖ్యానించారు. ఫార్మసిటీ కోసం వైఎస్సార్ హయాంలో నే పునాది పడింది అని గుర్తు చేశారు.

అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదలకు 30 లక్షల ఇళ్ళ పట్టాలను ఇచ్చిన విషయాన్ని మరొకసారి ప్రస్తావించారు. అయితే విశాఖ లో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వకుండా తెలుగు దేశం పార్టీ కోర్టు కెళ్ళింది అని ఆరోపించారు. ఈ రాష్ట్రాన్ని దోచుకునేందుకు చంద్రబాబు యత్నించారు అని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ ను 900 కోట్ల రూపాయల తో రూపొందించి, 400 కోట్ల రూపాయల అప్పులు, మిగిలిన ఆస్తులను జివీఎంసీ కి బాబు తాకట్టు పెట్టారు అంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో మెట్రో పై ఎప్పుడైనా సమీక్షించారా అంటూ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం భాధ్యత గా వ్యవహరించలేదు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మునిసిపల్ ఎన్నికల నేపథ్యం లో మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.