చంద్రబాబు ఎదురుదాడి చేయడం సరికాదు – మంత్రి బొత్స

Sunday, October 25th, 2020, 10:00:46 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తెలుగు దేశం పార్టీ హయం లో ఉండగా పలు అవినీతి, అక్రమాలకు పాల్పడింది అంటూ వైసీపీ నేతలు మొదటి నుండి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మేరకు మరొకసారి రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గీతం యూనివర్సిటీ ఆక్రమించిన ప్రభుత్వ భూములను వెనక్కి ఇచ్చి ఉంటే బావుండేది అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే తమకు ఎవరి మీదా కక్ష లేదు అని, గీతం యూనివర్సిటీ ఆక్రమించినవి ప్రభుత్వ భూములు కాబట్టే అధికారులు స్వాధీనం చేసుకున్నారు అని మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా వెల్లడించారు.

అయితే మీడియా సమావేశం లో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ, గీతం యూనివర్సిటీ ఆక్రమించిన భూములను వెనక్కి తీసుకోకూడదా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు బందువులు అయినంత మాత్రాన భూములు వదిలేయాలా అని అన్నారు. అయితే ఈ భూములు వ్యవహారం లో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని, ఆరు నెలల నుండి ఈ భూముల వివాదం నడుస్తోంది అని, చంద్రబాబు నాయుడు ఈ భూముల విషయం లో ఎదురుదాడి చేయడం సరికాదు అని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఎందుకు భూములు ఇవ్వలేక పోయారు అని, ప్రభుత్వ భూములు దోచుకునే వారికి బాబు వత్తాసు పలుకుతారా అంటూ బొత్స సత్యనారాయణ నిలదీశారు.

ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు విషయం లో కూడా అంచనాలు కాంట్రాక్ట్ కోసం ఇష్టానుసారం తగ్గించారు అని ఆరోపించారు. ప్రత్యేక హోదా టీడీపీ కేంద్రం వద్ద తాకట్టు పెట్టింది అని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.