టీడీపీ హయాంలో అతుకులతుకులుగా కట్టడం వలనే ఇలాంటి దుష్ఫలితాలు – మంత్రి అనిల్

Thursday, March 11th, 2021, 07:49:00 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో పోలవరం పనులను ప్రణాళిక లేకుండా అస్తవ్యస్తంగా చేయడం వలన 2018 లోనే డయాఫ్రమ్ వాల్ వరదకు కొట్టుకుపోయింది అని మంత్రి వ్యాఖ్యానించారు. నిజం ఇలా ఉంటే ఈనాడు పత్రిక మాత్రం దాన్ని కప్పి పుచ్చుతూ కథనం రాసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణాలు ఏమిటో ఈనాడు తన కథనం లో చెప్పక పోవడం దుర్మార్గం అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు ను నిర్లక్ష్యం చేస్తోంది అని దుష్ప్రచారం చేయడమే ఈ వార్త ఉద్దేశ్యం అంటూ మంత్రి వ్యాఖ్యానించారు.

డయాఫ్రమ్ వాల్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడే చేపట్టారు అని, దీనికి ఆయనే బాధ్యత వహించాలి అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఓ ప్రణాళిక ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మించాల్సి ఉండగా తెలుగు దేశం పార్టీ హయాంలో అతుకులతుకులుగా కట్టడం వలనే ఇలాంటి దుష్ఫలితాలు వస్తున్నాయి అని వ్యాఖ్యానించారు. అయితే స్పిల్ వే, స్పిల్ ఛానెల్ పూర్తి చేసి వరద నీటిని మల్లించాక కాఫర్ డ్యాం ను పూర్తి చేయాలి అని, తర్వాత డయాఫ్రమ్ వాల్ చేపట్టాలి అని, కానీ ఇష్టానుసారం గా అసంపూర్ణంగా చేశారు అంటూ చెప్పుకొచ్చారు.అయితే లక్షలాది క్యూ సెక్కుల వరద వస్తుందని తెలిసి కూడా అడ్డదిడ్డంగా కట్టడం వల్ల1.4 కిలో మీటర్లు ఉన్న డయాఫ్రమ్ వాల్ కు185 మీటర్ల మేర నష్టం జరిగింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రణాళిక బద్దంగా పూర్తి చేయాలని టీడీపీ కి జగన్ ప్రతి పక్ష నేత గా ఉన్నప్పుడే చెప్పినా పట్టించుకోలేదు అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.