ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు – ఆళ్ళ నాని

Sunday, May 16th, 2021, 09:00:14 AM IST

Alla-Nani

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం ప్రతి పక్ష పార్టీ అధికార పార్టీ వైసీపీ పై విమర్శలు చేయడాన్ని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని తప్పుబట్టారు. తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆళ్ళ నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరోనా విపత్కర సమయం లో కూడా చంద్రబాబు ప్రజల కోసం ఆలోచన చేయకుండా, ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా ప్రభుత్వం పై బురద జల్లడం చంద్రబాబు కి అలవాటే అంటూ చెప్పుకొచ్చారు.

అయితే కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నా, తెలుగు దేశం పార్టీ నేతలు, ఎమ్మెల్యే లు ఇష్టానుసారం గా ఆరోపణలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. అయితే ప్రభుత్వం పై నిత్యం విమర్శలు చేసే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు కోవిడ్ రోగులకు సహాయం చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదో చెప్పాలి అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే చేతనైతే కరోనా వైరస్ బాధితులకు సహాయం చేయాలని, లేదంటే హైదరాబాద్ లో నీ అద్దాల మేడలో తలుపు లేసుకొని ఉండాలి అని చంద్రబాబు, లోకేష్ లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రం లో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కి సీఎం జగన్ కృషి చేస్తుంటే, దానిని కూడా అవహేళన చేస్తూ టీడీపీ నేతలు విమర్శలు చేయడం వారి వివేకానికే వదిలేస్తున్నామని విమర్శలు చేశారు. ఆళ్ళ నాని చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.