పంచాయతీ ఎన్నికల పై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Tuesday, January 26th, 2021, 07:33:05 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో వైసిపి దే విజయం అంటూ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉదారం గా ఆలోచించి పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు తెచ్చారు అని అన్నారు. అయితే దాని ప్రకారం ఏకగ్రీవం అయ్యే పంచాయతీ లకు ఎక్కువగా నిధులను కేటాయించడం జరిగింది అని అన్నారు. అయితే ఈ ఏకగ్రీవం పై పలు వ్యాఖ్యలు చేశారు.

ఏకగ్రీవం అయిన ఎన్నిక లో రెండు వేల వరకు జనాభా ఉంటే ఐదు లక్షల నగదు, ఐదు వేల జనాభా ఉంటే పది లక్షల నగదు, పది వేల పైన జనాభా ఉంటే 15 లక్షల నగదు, ఆ పైన జనాభా ను పట్టి 20 లక్షల రూపాయల నగదు ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. అయితే ఈ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నాయి అని, గ్రామీణ ప్రాంత ప్రజలు అంతా ఏకమై ఏకగ్రీవం చేసుకోవాలి అని పిలుపు ఇచ్చారు. అయితే మద్యం, డబ్బు ప్రలోభాలతో, ఎవరైనా ఎన్నికైతే వారినీ అనర్హులుగా చేయడం మాత్రమే కాకుండా రెండేళ్ల వరకూశిక్ష పడేలా చట్టంలో మార్పులు తెచ్చాం అని మంత్రి తెలిపారు.