చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన హోమ్ మంత్రి సుచరిత

Thursday, December 17th, 2020, 03:20:17 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ నేత, హోమ్ మంత్రి మేకతోటి సుచరిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు నక్క జిత్తులను ప్రయోగిస్తున్నారు అని అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో శాంతి భద్రతలకి భంగం కలిగించాలన్నది ఆయన ప్లాన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తుళ్ళూరు లో చంద్రబాబు సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు అని, కాన్వాయ్ రూట్ ను కూడా పోలీసులకు ఇచ్చారు అని వివరించారు. అయితే ఆ రూట్ లో పోలీసులు అన్ని రకాలుగా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు అని చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పుడు ఆకస్మికంగా చంద్రబాబు రూట్ ను మార్చుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు అని తెలిపారు. అయితే మూడు రాజధానుల కి మద్దతుగా కార్యక్రమాలు చేస్తున్న వారి వైపు వెళ్ళాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు అని తెలిపారు. అయితే దీని ద్వారా ఘర్షణలు జరిగి, శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలనేది చంద్రబాబు నాయుడు ఉద్దేశ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు ఉండకూడదు అని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు అంటూ విరుచుకు పడ్డారు.ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలను ఖండించాలి అని, విషపు ఆలోచనలను విడిచి పెట్టీ పోలీసులకు సహకరించాలని సుచరిత వ్యాఖ్యానించారు. అయితే సుచరిత చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.