కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుంది.. ఏపీ సర్కార్‌పై హైకోర్ట్ సీరియస్..!

Thursday, May 6th, 2021, 09:01:55 PM IST

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్ట్ సీరియస్ అయ్యింది. రాష్ట్రంలో కరోనాకు సరైన చికిత్సలు అందడం లేదంటూ సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు, ఏపీసీఎల్ఏ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని వ్యాఖ్యానించింది. అఫిడవిట్‌లో దాఖలు చేసిన దానికి క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న విధానానికి పొంతనలేదని ధర్మాసనం అభిప్రాయపడింది.

అయితే ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు దొరకడం లేదని నోడల్ అధికారులే చెబుతుండడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పద్ధతి మార్చుకోకుంటే సీఎస్ అఫిడవిట్ దాఖలు చేయాల్సి వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు. రాష్ట్రంలో కరోనా పేషంట్లకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని, హోం ఐసోలేషన్లో ఉన్నవారికి 104, 1902 ద్వారా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నామని తెలిపారు.