అచ్చెన్న కేసులో సర్కార్‌కి షాక్ ఇచ్చిన హైకోర్ట్.. కీలక ఆదేశాలు..!

Wednesday, July 8th, 2020, 01:14:46 PM IST

అచ్చెన్నాయుడు కేసులో ఏపీ హైకోర్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నను అరెస్ట్ చేసిన ఏసీబీ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయనను గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అచ్చెన్న ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు చెప్పడంతో జూలై 1 ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఏసీబీ అధికారులు ఆయన్ను నేరుగా సబ్‌జైలుకు తరలించారు.

అయితే తనకు కోవిడ్ టెస్ట్ చేసి రిపోర్ట్ వచ్చిన తరువాత మాత్రమే డిశ్చార్జ్ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేసినా ఏసీబీ అధికారులు వినలేదు. అయితే ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఆయన్ను బలవంతంగా డిశ్చార్జి చేశారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారించిన హైకోర్టు అచ్చెన్నాయుడిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. అయితే కోర్టు నిర్ణయంపై ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడును ఏ ఆస్పత్రికి తరలించాలన్నది ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నిర్థారించాలని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ప్రభుత్వ తరుపు న్యాయవాది వాదనను ధర్మాసానం తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అచ్చెన్నాయుడును గుంటూరు రమేష్‌ ఆస్పత్రికి తరలిస్తున్నట్టు సమాచారం.