మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్.. ఏపీ హైకోర్ట్ కీలక తీర్పు..!

Wednesday, September 2nd, 2020, 03:07:07 PM IST

High_court

ఏపీలోని మద్యం ప్రియులకు హైకోర్ట్ గుడ్‌న్యూస్ చెప్పింది. మద్యపాన నిషేదమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్ సర్కార్ భారీ స్థాయిలో మద్యం ధరలను పెంచేసింది. అంతేకాదు మద్యం దుకాణాల సంఖ్యను కూడా పెద్ద మొత్తంలో తగ్గించి ఉన్న వాటిని కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అయితే ఏపీలో మద్యం ధర ఎక్కువ ఉండడం, బ్రాండెడ్ మద్యం దొరకకపోవడంతో కొందరు పక్క రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

అయితే అక్రమ మద్యం తరలింపుపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఉంచుతూ రాష్ట్ర సరిహద్దుల వద్ద నిత్యం భారీగా మద్యం సీసాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని తీసుకు వచ్చే వ్యక్తులకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జీవో నెంబర్ 411 ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకుని వచ్చే వెసలుబాటు ఉన్నప్పటికి ఏపీలోకి మాత్రం మద్యం తీసుకురానివ్వక పోవడంపై పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై నేడు విచారణ చేపట్టిన హైకోర్ట్ ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా 3 మద్యం సీసాలు తీసుకురావచ్చని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్ట్ తీర్పుతో ఏపీలోని మద్యం ప్రియులకు కాస్త ఉపశమనం కలిగినట్లు అయ్యింది.