అప్పటి వరకు వద్దు.. ఈ-వాచ్‌ యాప్‌‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..!

Friday, February 5th, 2021, 05:14:37 PM IST

ఏపీలో పంచాయితీ ఎమ్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులనైనా ఎస్ఈసీ దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుండేలా ఎస్ఈసీ ఈ-వాచ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ యాప్‌ ప్రైవేట్ యాప్ అని, భద్రతాపరమైన అనుమతులు లేకుండా దీనిని రూపొందించారని ఈ యాప్‌ను నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నేడు విచారణ చేపట్టిన హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఎన్నికల కమీషన్ రూపొందించిన ఈ-వాచ్‌ యాప్‌కు సెక్యూరిటీ డేటా సర్టిఫికెట్‌ కోసం గురువారమే దరఖాస్తు చేశారని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ పేర్కొంది. అనుమతి ఇచ్చేందుకు 5 రోజులు పడుతుందని ఏపీటీఎస్‌ చెప్పింది. ఇదిలా ఉంటే ప్రభుత్వ యాప్‌ ఉండగా ఈ-వాచ్ యాప్‌ ఎందుకని, సెక్యూరిటీ పరిశీలన లేకుండా యాప్‌ను ఉపయోగించడానికి వీల్లేదని ప్రభుత్వ తరపు పిటీషనర్లు కోర్టుకు చెప్పుకొచ్చారు. అయితే ఎస్‌ఈసీకి యాప్‌ను రూపొందించుకునే అనుమతి భారత ఎన్నికల సంఘం కల్పించిందని ఎన్నికల కమీషన్ తరపు ‌న్యాయవాది కోర్టుకు చెప్పుకొచ్చారు. గతంలో ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల కమీషన్‌ కూడా ఇలా ఓ యాప్ తయారు చేయించిందని స్పష్టం చేసింది. అయితే ఇరు వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసును ఈ నెల 9కి వాయిదా వేసింది. అంతేకాదు ఈ-వాచ్‌ యాప్‌ను 9వ తేదీ వరకు ఆపరేట్‌ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది.