బిగ్ న్యూస్: మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టు సంచలన తీర్పు..!

Wednesday, December 30th, 2020, 06:20:12 PM IST

మిషన్‌ బిల్డ్ ఏపీ కేసుపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన కారణంగా మిషన్ బిల్డ్ అధికారి ప్రవీణ్‌‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మిషన్‌ బిల్డ్‌ ఏపీ పేరుతో ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ పలువురు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్ల విచారణ నుంచి జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ తప్పుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.

అయితే మిషన్‌ బిల్డ్‌ ఏపీ ప్రత్యేకాధికారి ప్రవీణ్‌కుమార్ ఈ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసులో జస్టిస్ రాకేశ్‌కుమార్ పక్షపాతంలో వ్యహరించే అవకాశం ఉందని ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అయితే తాజాగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం తరఫున తప్పుడు అఫిడవిట్ సమర్పించడం సరికాదని, కోర్టు ధిక్కారం కింద ఆ అధికారిపై కేసు నమోదు చేయాలని సూచించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరుతూ ఈ కేసుపై తదుపరి విచారణను ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేసింది.