బిగ్ న్యూస్: ఇబ్బంది లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి – హైకోర్టు

Thursday, January 21st, 2021, 02:01:12 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నో రోజుల నుండి ఈ అంశం పై ఉత్కంఠ నెలకొంది. అయితే ఎన్నికల కమిషనర్ ప్రత్యేక అప్పీల్ పై వాదనలు వినిపించగా నేడు తీర్పు ప్రకటించింది. ఇబ్బంది లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సూచించింది. ప్రజారోగ్యం, పంచాయతీ ఎన్నికలు రెండూ కూడా ముఖ్యం అని తెలిపింది. అయితే ఈ మేరకు హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఎన్నికలు ఆపడానికి సహేతు కారణాలు లేవు అని, రాజ్యాంగం లోని 9, 9 ఏ ప్రకారం కాల పరిమితి లోగా ఎన్నికల నిర్వహణ తప్పనిసరి అంటూ తేల్చి చెప్పింది. తమ ప్రతినిధులను ఎన్నుకొనే హక్కు ప్రజలకు ఉంటుంది అని, అయితే ఎన్నికలు ఎలా నిర్వహించాలి అన్న నిర్ణయం ఎన్నికల కమిషన్ దే అని స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఎలాంటి అధికారాలు ఉన్నాయో, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి కూడా అలానే ఉన్నాయి అని తెలిపింది. అయితే ఎన్నికల కమిషన్ కి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదు అని, స్థానిక ఎన్నికలు జరిగితే ఎన్నిక అయిన ప్రజా ప్రతినిధులు వాక్సినేషన్ ప్రక్రియ ను ముందుకు తీసుకెళ్తారు అని తెలిపింది. అయితే వాక్సినేషన్ పేరుతో ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం కోరడం లో సహేతుకం లేదు అని, మూడవ దశలో భారీ సంఖ్య లో వాక్సినేషన్ ప్రక్రియ ఉన్న నేపథ్యం లో ఈ లోపు ఎన్నికల నిర్వహణ సబబు అంటూ తీర్పు ఇచ్చింది.