బిగ్ మిస్టేక్: తెలంగాణ రాష్ట్ర చిహ్నంతో ఏపీ సర్కార్ ఎన్నికల ప్రకటన..!

Wednesday, January 27th, 2021, 05:26:08 PM IST

ఏపీలో పంచాయితీ ఎన్నికలపై నిన్న మొన్నటి వరకు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. సుప్రీం కోర్టు తీర్పుతో పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ కూడా ఒకే చెప్పింది. ఈ తరుణంలో ఎక్కువ సంఖ్యలో పంచాయితీలను ఏకగ్రీవం చేసే దానిపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే పంచాయితీలను ఏకగ్రీవం చేసుకుందాం.. గ్రామాభివృద్ధికి సోపానాలు వేసుకుందాం అంటూ పత్రికల్లో ప్రకటనలు మొదలుపెట్టింది.

అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఆ ప్రకటనలలో ప్రభుత్వం ఓ బిగ్ మిస్టేక్ చేసింది. దీంతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి. పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుందాం.. గ్రామాభివృద్ధికి సోపానాలు వేసుకుందాం అంటూ ఇచ్చిన ప్రకటనలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఫోటోను పెట్టిన ప్రభుత్వం పొరపాటుగా తెలంగాణ పంచాయతీ కార్యాలయం ఫోటోను పెట్టారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నమైన ‘కాకతీయ కళాతోరణం’ ఆ ఫోటోలో స్పష్టంగా కనపడుతుంటంతో కనీస అవగాహన లేకుండా ప్రకటన ఎలా ఇస్తారని జగన్ సర్కార్‌ను నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.