ఇంటి వద్దకే రేషన్ సరుకులు.. ముహూర్తం ఫిక్స్ చేసిన సీఎం జగన్..!

Monday, January 4th, 2021, 10:29:52 PM IST

ఏపీలో రేషన్ సరుకుల డోర్ డెలివరీ అంశంపై ఎట్టకేలకు సీఎం జగన్ స్పష్టతను ఇచ్చారు. నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ రేషన్ సరుకుల డోర్ డెలివరీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 1 నుంచి రేషన్ సరుకుల డోర్ డెలివరీని ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నెల మూడో వారానికి దీనికి సంబంధించిన పంపిణీ వాహనాలు, సరుకుల ప్యాకింగ్ బ్యాగులు అందుబాటులో ఉంచాలని అన్నారు.

అయితే రేషన్ డోర్ డెలివరీ కోసం ప్రభుత్వం 9260 మొబైల్‌ యూనిట్లు సిద్ధం చేసింది. రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం, క్రిస్టియన్‌ మైనారిటీలకు ప్రభుత్వం కేటాయించింది. అయితే లబ్ధిదారులకు 30 శాతం సబ్సిడీ, 60 శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారుడి వాటాతో వాహనాలను అందిస్తుంది. ఇక వాహనాల సంఖ్య ప్రకారమే అధునాతన వేయింగ్ మిషన్లను కూడా అందుబాటులోకి తెస్తుంది. దీంతో పాటు సరుకుల పంపిణీ కోసం 2.19 కోట్ల నాన్‌ ఓవెన్‌ క్యారీ బ్యాగులను సిద్ధం చేస్తుంది.