ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్లు.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు..!

Friday, May 7th, 2021, 11:46:45 PM IST

ఏపీలో కరోనా కట్టడికి, మెరుగైన చికిత్సకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్లను కరోనా పేషెంట్లకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు, ఎంప్యానెల్‌ జాబితాలోని ఆస్పత్రుల్లో బెడ్లు కేటాయించాలని స్పష్టం చేసింది. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో తక్షణమే 50 శాతం బెడ్లను గుర్తించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

అంతేకాదు ఎంప్యానెల్‌ కానీ ఆస్పత్రులను తాత్కాలిక ఎంప్యానెల్‌ చేయాలని వాటిలోనూ 50 శాతం బెడ్లు కోవిడ్‌ ఉచిత, నగదు రహిత వైద్యం పొందే పేషంట్లకు కేటాయించాలని ప్రభుత్వం సూచించింది. ఆరోగ్యమిత్ర, నోడల్‌ ఆఫీసర్ల పరిధిలోకి బెడ్లు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా ఏ కోవిడ్‌ పేషంట్‌ను ఆస్పత్రిలో అడ్మిషన్‌ నిరాకరించరాదని ఖచ్చితంగా డాక్టరు అడ్మిషన్‌ సూచించిన వారిని చేర్చుకోవాలని ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.