పంచాయితీ ఎన్నికలు నిర్వహించలేం.. తేల్చేసిన ఏపీ సర్కార్..!

Tuesday, December 15th, 2020, 07:35:40 PM IST

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. నేడు స్థానిక ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టులో అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని తేల్చిచెప్పింది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కరోనా వాక్సినేషన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసిందని, అయితే వాక్సినేషన్ ప్రక్రియ నిర్వహణకు పోలీసులతో పాటు అన్ని శాఖల సిబ్బందిని వినియోగించాల్సి ఉందని తెలిపింది.

అంతేకాదు మొదటి డోస్ వేసిన నాలుగు వారాల తర్వాత రెండవ డోస్ వేయాలని కేంద్రం సూచించిందని, ఎన్నికల ప్రక్రియ లాగానే వాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉందని కోర్టుకు తెలిపింది. అయితే ప్రజారోగ్యం దృష్ట్యా వాక్సినేషన్ ప్రక్రియకు ప్రాధాన్యమివ్వాల్సి ఉందని, అందువలన ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. కాగా అడిషనల్ అఫిడవిట్ తనకు గత రాత్రి అందిందని కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఎస్ఈసీ కోరడంతో ఈ కేసు విచారణను ధర్మాసనం వచ్చే శుక్రవానికి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.