ఎస్ఈసీ నిమ్మగడ్డపై మరో ఎటాక్.. సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు..!

Sunday, January 31st, 2021, 03:00:20 AM IST

ఏపీలో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు మరియు వైసీపీ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదం కొనసాగుతూనే ఉంది. వైసీపీ మంత్రులు నిమ్మగడ్డపై ఆరోపణలు చేస్తుంటే, నిమ్మగడ్డ మాత్రం వైసీపీ నేతల ఆరోపణలను తప్పుపడుతున్నారు. అయితే తాజాగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై ఏపీ ప్రభుత్వం సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది.

అయితే మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ కలిసి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై శాసన సభ స్పీకర్‌ కార్యాలయంలో నోటీసులు ఇచ్చారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన పరిధి దాటి వ్యవహరిస్తూ తమపై వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉందంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై పార్లమెంట్‌లో సభా హక్కుల నోటీసు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.