కరోనా వ్యాక్సిన్ పంపీణీపై కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్..!

Monday, December 21st, 2020, 09:00:05 PM IST

ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా దేశాలు కరోనా వ్యాక్యిన్ పైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికే ప్రజలకు వ్యాక్సిన్ కూడా వేస్తున్నారు. భారత్‌లో కూడా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కసరత్తు ప్రారంభించింది.

అయితే తొలుత వ్యాక్సిన్ ఎవరెవరికి ఇవ్వాలి, ఎలా పంపిణీ చేయాలన్న అంశంపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు విడివిడిగా వ్యాక్సిన్ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించారు. పట్టణ ప్రాంతాల్లో వ్యాక్సిన్ పంపిణీ కసరత్తు కోసం అర్బన్ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ కమీషనర్ చైర్‌పర్సన్‌గా 9 మంది సభ్యులతో కమిటీని నియమించింది. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, మండలస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఉత్తర్వుల్లో కొన్ని మార్పులు చేపట్టింది. స్టేట్ టాస్క్‌ఫోర్స్‌లో మరో ఆరుగురు సభ్యులు, జిల్లా టాస్క్‌ఫోర్స్‌లో మరో 31 మంది అధికారులు సభ్యులగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది.