అంతర్వేది రథంపై కీలక ప్రకటన చేసిన ఏపీ దేవాదాయశాఖ..!

Tuesday, September 15th, 2020, 07:33:07 AM IST

అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం దగ్ధం అయిన ఘటన తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై హిందూ సంఘాలు, విపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగి ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ఈ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పచెప్పింది. అయితే ఇదిలా ఉండగా తాజాగా కొత్త రథం నిర్మాణంపై ఏపీ దేవాదాయశాఖ కీలక ప్రకటన చేసింది.

వచ్చే ఫిబ్రవరిలోపు అంతర్వేదిలో రథం నిర్మాణం పూర్తవుతుందని దేవాదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు తెలిపారు. వచ్చే ఫిబ్రవరిలో అంతర్వేది స్వామి వారి కల్యాణోత్సవాలు జరుగుతాయని, అప్పటిలోగా అంద‌రి అభిప్రాయాల మేర‌కు రథం ఆకృతిలో ఎటువంటి మార్పులు లేకుండా కొత్త రథాన్ని సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను అదేశించిన‌ట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే కొత్త రథానికి సంబంధించి డిజైన్ రెడీ అయ్యింది. అచ్చం పాత రథం మాదిరే ఉంటూ మరింత ఆకర్షణీయంగా, అత్యంత శాస్త్రబద్ధంగా ఉండేలా కొత్త రథం డిజైన్ సిద్దం చేశారు. 41 అడుగుల ఎత్తు, ఆరు చక్రాలతో, ఏడు అంతస్తులుగా కొత్త రథాన్ని చేయించబోతున్నారు. ఈ రథం నిర్మాణానికి, షెడ్డు రిపేర్, ఇనుప షట్టర్‌ ఏర్పాటికి 95 లక్షలు ఖర్చు అవుతున్నట్టు అంచనా వేశారు.