టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాసిన ఏపీ డీజీపీ..!

Tuesday, September 29th, 2020, 02:47:07 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ లేఖ రాశారు. చిత్తూరు జిల్లాకు చెందిన న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి చేసింది వైసీపీ నేతలే అని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ఆరోపిస్తూ ఇటీవల చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. అయితే ఈ లేఖపై స్పందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ చంద్రబాబుకు ప్రత్యుత్తరమిచ్చారు.

అయితే చట్టప్రకారం తాము విధులు నిర్వర్తిస్తామని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీలాంటి వ్యక్తులు మీడియాకు లేఖలు ఇచ్చే ముందు వాస్తవాలను పరిశీలించాలని లేఖలో కోరారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో జరిగిన ఘటనపై కేసు నమోదు చేశామని, ప్రతాప్‌రెడ్డికి పండ్ల వ్యాపారికి మధ్య దారి విషయంలో వాగ్వాదం జరుగుతుండగా వెళ్లిన రామచంద్రపై ప్రతాప్‌రెడ్డి దాడి చేశారని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించామని ప్రతాప్‌రెడ్డిని కూడా అరెస్టు చేసినట్టు తెలిపాడు.