40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీ చతికిల పడింది – ఉప ముఖ్యమంత్రి కృష్ణదాసు

Wednesday, March 3rd, 2021, 11:58:53 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తాజాగా పంచాయతీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతి పక్ష పార్టీ అయిన తెలుగు దేశం ఘోర పరాజయం పాలైంది. వైసీపీ మరొకసారి పూర్తి స్థాయిలో ఆధిక్యం కనబరిచింది. అయితే రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధిస్తుంది అని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ ఎన్నికలను ఉద్దేశిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

మునిసిపల్ ఎన్నికల్లో విజయం తమదే అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాల వలనే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బల పరిచిన అభ్యర్దులు విజయం సాధించారు అని అన్నారు. ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పై ఉన్న నమ్మకానికి ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చారు. 40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీ చతికిల పడింది అంటూ విమర్శించారు. అయితే తెలుగు దేశం పార్టీ కి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్ధులు దొరకడం లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మునిసిపల్ ఎన్నికల తర్వాత పార్టీ పని అయిపోయినట్లే అంటూ చెప్పుకొచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు మించిన ఫలితాలను మున్సిపల్ ఎన్నికలలో సాధిస్తామని కృష్ణదాస్ ధీమా వ్యక్తం చేశారు.