ఏపీ సీఎం సహాయనిధి నుంచి రూ.117 కోట్ల స్వాహాకు కుట్ర..!

Sunday, September 20th, 2020, 09:07:51 AM IST

ఏపీలో భారీ మోసానికి దుండగులు కుట్ర పన్నారు. నకిలీ చెక్కులతో సీఎం సహాయ నిధి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కొల్లగొట్టేందుకు ప్రయత్నించారు. ఏకంగా రూ.117 కోట్లు స్వాహా చేసేందుకు ప్రయత్నించగా చివరి నిమిషంలో బ్యాంకు అధికారుల అప్రమత్తతతో బెడిసికొట్టింది.

అయితే నకిలీ సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు తయారు చేసి మంగళూరులో రూ.52.65 కోట్లు, ఢిల్లీలో రూ.39.85 కోట్లు, కోల్‌కతాలో రూ.24.65 కోట్ల చెక్కులను క్లియరెన్సు కోసం బ్యాంకులకు పంపారు. అయితే భారీ మొత్తంలో డబ్బుల విత్‌డ్రా చేయడం, పైగా ఆ ఖాతా సీఎం రిలీఫ్ ఫండ్‌కి సంబంధించినది కావడంతో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి సీఎంవో కార్యాలయానికి ఫోన్ చేసి సమాచారం అందించారు. అయితే తాము ఎలాంటి చెక్కులను జారీ చేయలేదని వాటిని క్లియర్ చేయవద్దని చెప్పడంతో ఈ భారీ మోసం బట్టబయలయ్యింది. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.