ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం జగన్.. ఎందుకోసమంటే?

Saturday, April 10th, 2021, 12:31:44 PM IST


ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు రాష్ట్రంలో వ్యాక్సిన్ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ పంపిణీపై సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11 నుంచి 14 వరకు నాలుగు రోజులపాటు టీకా ఉత్సవ్‌ను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉత్సవ్‌లో భాగంగా రోజుకు ఆరు లక్షల మందికి టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్‌ లేఖ రాశారు.

అయితే టీకా ఉత్సవం కోసం ఏపీకి వెంటనే 25 లక్షల కోవిడ్‌ డోస్‌లు పంపించాలని ప్రధానమంత్రిని ఈ లేఖ ద్వారా సీఎం జగన్ విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. కేంద్రం సూచన మేరకే రేపటి నుంచి టీకా మహోత్సవం నిర్వహిస్తున్నామని ఇందుకోసం కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించాలని కోరారు. కోవిడ్‌ నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలతో పాటు, వాక్సినేషన్‌ ప్రక్రియను రాష్ట్రంలో ఏ లోటూ లేకుండా అమలు చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.