కొత్త ఇసుక పాలసీపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం..!

Thursday, November 5th, 2020, 03:37:20 PM IST

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన నేడు జరుగుతున్న కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కొత్త ఇసుక పాలసీకి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని ఇసుక రీచ్‌లను ఒకే సంస్థకు అప్పగించాలన్న సబ్ కమిటీ సిఫారసుకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే తొలుత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు దీనిని అప్పగించాలని అనుకున్నా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు రాకపోవడంతో రాష్ట్రంలోనే పేరుగాంచిన ప్రైవేట్ సంస్థకు దీనిని అప్పగించాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ సిఫార్సు చేసింది.

ఇదిలా ఉంటే ఈ కేబినెట్ సమావేశంలో జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం పథకానికి కూడా ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఫైర్ డిపార్ట్మెంట్‌ను నాలుగు జోన్ లుగా విభజించేందుకు కూడా మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసినట్టు సమాచారం. ఫైర్ డిపార్ట్మెంట్ లో ఖాలీగా వున్న పోస్టుల భర్తీకి కూడా క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎస్ఈబీ పరిధిని విస్తరించాలని యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది.