కేబినెట్ డిసీషన్: మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన జగన్ సర్కార్..!

Tuesday, February 23rd, 2021, 10:29:00 PM IST

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన నేడు జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంక్షేమ పథకాల క్యాలెండర్‌కు కేబినెట్ ఆమోదం తెలపడమే కాకుండా మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అగ్రవర్ణ పేద మహిళల కోసం ఈబీసీ నేస్తం పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా 45-60 ఏళ్ల ఈబీసీ మహిళలకు మూడేళ్లలో ఏటా రూ.15 వేల చొప్పున 45 వేల ఆర్థిక సాయం అందించబోతున్నారు.

అయితే ఈ ఈబీసీ నేస్తం పథకానికి ప్రభుత్వం రూ.670 కోట్లను కేటాయించబోతుంది. ‎ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే ఈ పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. అయితే వచ్చే బడ్జెట్‌లోనే ఈ పథకానికి సంబంధించిన కేటాయింపులను జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది. అంతేకాదు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా త్వరలోనే విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.