ఏపీ సర్కార్‌పై గవర్నర్‌కి ఫిర్యాదు చేయనున్న బీజేపీ చీఫ్ సోమువీర్రాజు..!

Wednesday, September 16th, 2020, 10:08:02 AM IST

Somu_Veerraju

ఏపీ సర్కార్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు గవర్నర్‌కి ఫిర్యాదు చేయనున్నారు. అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం దగ్ధం అయిన ఘటన, ఇతర ఆలయాలలో జరిగిన ఘటనలను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర బీజేపీ నేతలు జగన్ సర్కారుతో అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్దమయ్యారు.

ఈ నేపధ్యంలో నేడు సోము వీర్రాజు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను కలవనున్నారు. అంతర్వేది రథం దగ్ధం, ఇతర ఆలయాలలో జరిగిన ఘటనలను గవర్నర్‌కు వివరించనున్నారు. ఈ ఘటనలపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని దీనిపై ప్రశ్నించినందుకు మహిళలు, భక్తులు, పార్టీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి, అరెస్టు చేశారని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అంతేకాదు బీజేపీ నేతలపై జరిగిన దాడుల పట్ల ప్రభుత్వం స్పందించడం లేదంటూ ఆధారాలను సైతం గవర్నర్‌కి అందించనున్నారు.