కేంద్రం ఇచ్చిన కోవిడ్ సాయం ఏమైంది.. జగన్ సర్కార్‌కి బీజేపీ సూటి ప్రశ్న..!

Monday, August 17th, 2020, 08:11:41 AM IST

ap-bjp-chief-somu-veerraju

జగన్ సర్కార్‌కి ఏపీ బీజేపీ సూటి ప్రశ్న వేసింది. కోవిడ్ సాయం కింద రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన వేల కోట్లు ఏమయ్యాయని బీజేపీ ప్రశ్నించింది. దేని దేనికి ఖర్చు చేశారో చెప్పాలని పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, నెహ్రూ యువకేంద్రం వైస్‌ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి ట్విటర్‌ ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.

అంతేకాదు పీపీఈ కిట్ల కోసం, బీమా కోసం పీజీ డాక్టర్లు కొన్ని వారాలుగా ఆందోళన చేస్తున్నా జగన్‌ సర్కార్‌ పట్టించుకోవడం లేదని అన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్‌లోని మారుమూల గ్రామానికి కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని తరలిస్తే ఎటువంటి సౌకర్యాలూ లేక నిరుపయోగంగా మారే అవకాశం ఉందని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. టీడీపీ ప్రభుత్వం విశాఖ సమీపంలో ప్రతిపాదిత భోగాపురం విమానాశ్రయానికి దగ్గర్లో 500ఎకరాలు కేటాయించిందని, అక్కడ అన్ని అనుకూలతలు ఉన్నాయని, సౌకర్యాలు ఏర్పాటు చేస్తే గిరిజన విద్యార్థులు అభివృద్ధి చెందుతారని అన్నారు.