ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు చెక్.. ఏపీలో డ్రీమ్11 పై నిషేధం..!

Wednesday, September 30th, 2020, 08:40:14 AM IST

పొట్టి ఓవర్ల క్రికెట్ లీగ్ ఐపీఎల్ ప్రారంభం కావడంతో బెట్టింగుల పర్వం జోరందుకుంది. డ్రీమ్ 11లో ఇవాళ మ్యాచ్ జరిగే జట్ల నుంచి ప్లేయర్స్‌ను ఎంచుకొని యూజర్లు తమ డ్రీమ్ జట్టును ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఆ మ్యాచ్‌లో యూజర్లు ఎంచుకున్న ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా పాయింట్లు వస్తాయి. ఆ కంటెస్ట్‌లో విజయం సాధించిన వారు డబ్బులు గెలుచుకోవచ్చు. అయితే దీనిలో యూత్ ఎక్కువగా పాల్గొంటుండడంతో డబ్బులను పోగొట్టుకుని అప్పులు చేసుకుంటారన్న నేపధ్యంలో డ్రీమ్ 11 ఫాంటసీ క్రికెట్‌లో డబ్బులు పెట్టి ఆడటంపై తెలంగాణ, అసోం, ఒడిశా, నాగాలాండ్‌ ప్రభుత్వాలు నిషేధం విధించాయి.

అయితే తాజాగా ఏపీలో కూడా ఐపీఎల్ స్పాన్సర్ డ్రీమ్ 11పై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్‌లో ఇటీవల చేసిన సవరణల కారణంగా ఏపీలోని డ్రీమ్ 11 యూజర్లు పెయిడ్ కంటెస్ట్‌లో జాయిన్ అవ్వలేకపోతున్నారు. అయితే డ్రీమ్ 11 యాప్‌లో ఉచితంగా ఫాంటసీ క్రికెట్ ఆడుకోవచ్చు కానీ, డబ్బులు చెల్లించే కంటెస్ట్‌లపై మాత్రమే నిషేధం విధించింది. అయితే ఇప్పటికే తమ వ్యాలెట్‌లో ఉన్న డబ్బును ఎలా విత్‌డ్రా చేసుకోవాలని అని చాలా మంది యూజర్లు ప్రశ్నిస్తుండగా వాలెట్ నుంచి నగదు ఉపసంహరణపై డ్రీమ్ 11 స్పందించింది. మీ డబ్బులు డ్రీమ్‌ 11 వాలెట్‌లో సేఫ్‌గా ఉంటాయని, దీనికి సంబంధించిన వివరాల కోసం http://d11.co.in/HelpCenter లోకి వెళ్లి కాంటాక్ట్ అజ్ కింద మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీ డబ్బును తిరిగి చెల్లిస్తామని చెప్పుకొచ్చింది.