దేవుడు కాస్ట్ చాలా ఎక్కువ .. గుడికి వెళ్ళేది డబ్బుల కోసమా ?

Thursday, October 6th, 2016, 12:22:29 PM IST

god
దేవుడు కాస్ట్లీ అయిపోతున్నాడు .. ఇదివరకు లాగా ప్రశాంతత కోసం ఆలయాలకి వెళ్ళడం అనే రోజులు పోయాయి. దేవుడికి వచ్చింది నైవేద్యం – పెట్టింది పులుహోర టైపు లో కాకుండా దేవుడు ఇచ్చే ప్రశాంతత కి కూడా డబ్బులు కలక్ట్ చెయ్యడం మొదలెట్టారు. ఎప్పటి నుంచో ఉన్న అలవాటే గానీ ఈ మధ్యన సర్కారు భారీ సన్నాహాల నడుమ జనాలదగ్గర ఇంకా డబ్బులు గుంజే ప్రయత్నాలు చేస్తోంది. ఈ మధ్యన ముఖ్యమంత్రి చంద్రబాబు తన సమీక్ష లో దేవాలయాల నుంచి ఆదాయం పెరుగుతోంది అని దాని మీద మరింత దృష్టి పెట్టాలి అని అధికారులకి చెప్పిన సంగతి తెలిసిందే. దాన్ని పట్టుకున్న అధికారులు ఇష్టం వచ్చినట్టు చార్జీలు పెంచి పారేస్తున్నారు. రెండు దేవాలయాలకి అధికారుల్లుగా ఐఏఎస్ లని నియమించటం చూస్తుంటే దేవాలయాల ఆదాయం మీద ప్రభుత్వం ఎంతగా కన్నేసిందో అర్ధం చేసుకోవచ్చు. భక్తుల రద్దీ, ప్రసాదం లాంటివి దృష్టిలో ఉంచుకుని రకరకాల ఆదాయ వనరులు బయటకి లాగుతున్నారు. ప్రస్తుతం నియామకం జరిగిన రెండు ఆలయాల్లోనూ ఆదాయాన్ని పెంచడంపైనే వీరు ఎక్కువగా దృష్టి సారించినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రధాన ఆలయాల్లో ఇప్పటికే సేవల ధరలు పెరిగాయి. మిగిలిన దేవాలయాల్లో కూడా పెంచాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో కొన్ని సేవల ధరలను ఒక్కసారిగా పెంచుతూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన ఏ గ్రేడ్ ఆలయాల్లోనూ దశలవారీగా పెంచే యోచనలో కసరత్తు జరుగుతోంది. శ్రీశైలం లో పెంచిన ధరలు భక్తులకి షాకింగ్ గా ఉన్నాయి. రద్దీ పేరుతో ధరలు పెంచేసి రెండు రకాల కొత్త టికెట్ విధానాన్ని అమలు చెయ్యబోతున్నారు.