విభజన వైపు ఏపీఎస్ఆర్టీసీ?

Friday, January 16th, 2015, 01:38:56 PM IST


రాష్ట్ర విభజన నేపధ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ విభజన అంశాన్ని చర్చించడానికి నేడు కేంద్ర రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీతో తెలుగు రాష్ట్రాల సీఎస్ లు సమావేశంకానున్నారు. కాగా రాష్ట్ర విభజన నేపధ్యంగా ఇప్పటికే రెండు రాష్ట్రాలలో వేరువేరు పాలన కొనసాగుతుండగా ఆర్టీసీ సేవలు మాత్రం రెండు రాష్ట్రాలలో ఉమ్మడి సంస్థ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి.

ఇక ఆర్టీసీ విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్యన ఇప్పటి వరకు చర్చలు జరిపిన దాఖలాలు కూడా లేకపోవడంతో ఇప్పుడు నితిన్ గడ్కరితో జరిగే సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే రెండు రాష్ట్రాలకు చెందిన కార్మికులకు వేతనాలు, పండగ అడ్వాన్సుల పేరిట రెండు ప్రభుత్వాలు నిధులను కూడా విడుదల చేస్తున్నాయి. ఇక సంస్థ విభజన తర్వాత రెండు రాష్ట్రాలలో ఆర్టీసీ సేవలకై వేరువేరు విభాగాలు రంగంలోకి దిగనున్నాయి. ఇక ఈ విభజన అంశాలను పరిష్కరించడానికి నేడు తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావులు కేంద్రమంత్రి నితిన్ గడ్కారితో భేటీ అయ్యి చర్చలు జరపనున్నారు.