ఏపీ, తెలంగాణ బీజేపీకి కొత్త ఇంఛార్జ్‌లు.. ఎవరో తెలుసా?

Saturday, November 14th, 2020, 01:16:34 AM IST

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు బీజేపీ ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణకు కూడా కొత్త ఇంఛార్జ్‌లను నియమించింది. ఏపీ‌ ఇంఛార్జ్‌గా మురళీధరన్‌ను నియమించారు. ప్రస్తుత ఇంఛార్జ్ సునీల్ దియోధర్‌‌కు సహ ఇంఛార్జ్‌గా బాధ్యతలు అప్పచెప్పారు. ఏపీ ఇంఛార్జ్‌గా నియమితులైన వి.మురళీధరన్ కేరళకు చెందిన నేత. 2010-15 మధ్య కాలంలో కేరళ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం భారత విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా ఉన్నారు.

ఇక తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్‌గా పంజాబ్‌కి చెందిన నేత తరుణ్ చుగ్‌కు బాధ్యతలు అప్పచెప్పారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న తరుణ్ చుగ్ జమ్మూకాశ్మీర్, లేహ్ ఇంఛార్జ్ బాధ్యతలను కూడా చూసుకుంటున్నారు. ఇక ఏపీకి చెందిన దగ్గుబాటి పురందేశ్వరిని ఛత్తీస్‌గడ్, ఒడిశా రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఇక తెలంగాణకు చెందిన డీకే అరుణకు కర్నాటక సహ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు సహ ఇన్‌ఛార్జ్‌గా పొంగులేటి సుధాకర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది.