అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కొత్త రథం డిజైన్ రెడీ..!

Saturday, September 12th, 2020, 09:32:50 AM IST

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథానికి నిప్పంటుకుని కాలిపోయిన ఘటన పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క హిందూ ధార్మిక సంఘాలు, జనసేన, బీజేపీ సంయుక్త పోరాటాలు, టీడీపీ విమర్శలతో ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించినా రాజకీయ దుమారం మాత్రం కొనసాగుతూనే ఉంది.

అయితే ఇలాంటి నేపధ్యంలోనే కొత్త రథానికి సంబంధించి డిజైన్ రెడీ అయ్యింది. ఆలయ ప్రత్యేకాధికారి రామచంద్రమోహన్‌, ఏసీ భద్రాజీ కొత్త నమూనాను పరిశీలించారు. అయితే అచ్చం పాత రథం మాదిరే ఉంటూ మరింత ఆకర్షణీయంగా, అత్యంత శాస్త్రబద్ధంగా ఉండేలా కొత్త రథం డిజైన్ సిద్దం చేశారు. 41 అడుగుల ఎత్తు, ఆరు చక్రాలతో, ఏడు అంతస్తులుగా కొత్త రథాన్ని చేయించబోతున్నారు. ఈ రథం నిర్మాణానికి, షెడ్డు రిపేర్, ఇనుప షట్టర్‌ ఏర్పాటికి 95 లక్షలు ఖర్చు అవుతున్నట్టు అంచనా వేశారు. అయితే కాలిపోయిన రథానికి 84 లక్షల ఇన్సూరెన్స్ ఉన్నప్పటికి కేసు తేలి, రథం ఎలా కాలిందో తేలాకా భీమా వర్తిస్తుందా లేదా అన్నది తెలుస్తుంది. 2021 ఫిబ్రవరిలో లక్ష్మీనరసింహ స్వామి కల్యానోత్సవాలు ఉండడంతో అప్పటిలోపు రథాన్ని సిద్ధం చేయాలని, కొత్త రథం తయారీ ఖర్చును ప్రభుత్వమే భరించబోతుందని సమాచారం.