ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ కొద్ది రోజులుగా విచారణను మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారిస్తున్న సీబీఐకి కరోనా అడ్డంకిగా మారింది. సీబీఐ బృందంలోని అధికారులలో ఏడుగురికి కరోనా సోకడంతో దర్యాప్తుకు బ్రేక్ పడింది. అయితే మరో కొత్త సీబీఐ బృందంతో ఈ కేసును విచారణ చేయించాలని భావిస్తున్నారు.
అయితే తాజాగా ఈ కేసులో ఓ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఏడాది జులై 9న సీబీఐ దర్యాప్తు చేపట్టగా, ఈ దర్యాప్తు బాధ్యతలను ఢిల్లీలోని స్పెషల్ బ్రాంచ్‌కి అప్పగించారు. అయితే IPC సెక్షన్ 302 ప్రకారం హత్యానేరం అభియోగంతో ఈ కేసును రీరిజిస్టర్ చేశారు. మొదట వివేకా మృతిపై సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు దీనిని 302గా మార్చారు. ప్రత్యేక నేరాల దర్యాప్తు విభాగానికి చెందిన థర్డ్ బ్రాంచ్ డీఎస్పీ దీపక్ గౌర్‌కి ఈ కేసు బాధ్యతలను అప్పగించారు. అయితే త్వరలోనే ఈ స్పెషల్ టీమ్ రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టబోతుంది.