కరోనా బారిన పడిన మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే..!

Wednesday, December 23rd, 2020, 04:31:32 PM IST

ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి ఏ ఒక్కరిని విడిచి పెట్టడంలేదు. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఇలా ఎవరో ఒకరు కరోనా బారిన పడక తప్పడం లేదు. తాజాగా తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.

అయితే కరోనా కారణంగా కొద్ది రోజుల వరకు తనను పరామర్శించడానికి ఎవరు ఫోన్ చేయొద్దని, అలాగే కలవటానికి కూడా ప్రయత్నించవద్దని ప్రజలకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. భగవంతుడు, ప్రజల ఆశీస్సులతో తాను త్వరలోనే కోలుకుని మళ్ళీ ముందుకు వస్తానని అన్నారు. అయితే గత వారం రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు వెంటనే కరోనా‌ పరీక్ష చేయించుకుని హోం క్వారంటైన్‌లో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.