ఏపీలో మరో శిరోముండనం ఘటన.. అప్పు కట్టలేదని..!

Monday, October 5th, 2020, 08:30:36 AM IST

ఏపీలో మరో శిరోముండనం ఘటన వెలుగుచూసింది. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం, విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగిన శిరోముండనం ఘటనలు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన అలక అభిలాష్ అనే వ్యక్తి జంగారెడ్డిగూడానికి చెందిన యర్రసాని విజయ్‌బాబు వద్ద 30 వేలు అప్పుగా తీసుకున్నాడు.

అయితే అప్పు తీసుకుని మూడు నెలల కావడంతో అప్పు తీర్చాల్సిందిగా విజయ్, అభిలాష్‌పై ఒత్తిడి తెచ్చాడు. అయితే అక్టోబర్ 3వ తేదీన విజయ్‌బాబు తన స్నేహితులు షేక్ నాగూల్ మీరావళి, మార్కెండేయులుతో కలిసి అభిలాష్ ఇంటికి వెళ్ళాడు. అనంతరం అభిలాష్‌ను కారులో ఎక్కించుకుని వేరే ప్రదేశానికి తీసుకెళ్ళి అప్పు తీర్చలేదన్న అక్కసుతో అభిలాష్‌కు శిరోముండనం చేయించారు. ఆ తర్వాత అభిలాష్‌ను ఆర్టీసీ బస్టాండు వద్ద వదిలేయగా బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.