ఏపీకి తప్పని తిప్పలు.. వరుసగా మరో మూడు తుఫాన్‌లు..!

Saturday, November 28th, 2020, 09:00:16 AM IST

ఏపీకి వరుస తుఫాన్ల గండం తప్పేలా లేదు. ఇంకా నివర్ తుపాన్‌ సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకోకముందే మరో తుఫాన్ రాబోతుంది. ఇది మాత్రమే కాకుండా డిసెంబర్ మొదటి వారంలో మరో రెండు తుపాన్లు వచ్చే అవకాశం ఉందని వాటి ప్రభావం కూడా ఏపీపై ఉండనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికల జారీ చేసింది. దక్షిణ అండమాన్‌ సముద్రంలో శుక్రవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఆ తర్వాత ఇది వాయుగుండంగా మారి, ఆ తర్వాత బలపడి తుపాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుపాన్ డిసెంబర్ 2వ తేదీన తమిళనాడు-పుదుచ్చేరి మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇక దీని తర్వాత డిసెంబర్‌ 2న ‘బురేవి తుఫాన్’ ఏర్పడనుందని, ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక డిసెంబర్ 5న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో ‘టకేటి తుఫాన్’ ఏర్పడే అవకాశం ఉందని, ఇది దక్షిణ తమిళనాడు, ఏపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.