భూమా అఖిలప్రియకు షాక్.. బెయిల్‌ ఇవ్వద్దని పోలీసుల కౌంటర్..!

Friday, January 8th, 2021, 06:11:34 PM IST

టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు షాక్ తగిలింది. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన భూమా అఖిలప్రియకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే భూమా అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోర్టులో కౌంటరు దాఖలు చేశారు. అఖిలప్రియ బెయిల్‌పై వస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని, సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశముందని కౌంటర్‌లో పేర్కొన్నారు. అంతేకాదు అఖిలప్రియకు ఆర్ధికంగా, రాజకీయంగా ప్రభావితం చేయగలిగే పలుకుబడి ఉందని అఖిలప్రియ బెయిల్‌పై విడుదలైతే మరిన్ని నేరాలకు పాల్పడవచ్చని కూడా పోలీసులు పిటీషన్‌లో తెలిపారు.

ఇక అంతకు ముందు అఖిలప్రియను 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అనుచరుల ప్రమేయం ఉందని తేలిందని, అఖిలప్రియ భర్త సహా మిగతా నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని పోలీసుకులు కోర్టుకు తెలిపారు. నిందితులందరిని అదుపులోకి తీసుకున్నాక కిడ్నాప్ సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయాల్సి ఉందని, అందుకే రేపటి నుంచి ఈనెల 15 వరకు అఖిలప్రియను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు తెలిపారు.