దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోయింది అతడి కారణంగానేనా?

Wednesday, November 11th, 2020, 10:29:31 PM IST


దుబ్బాక ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధానంగా అనేక కారణాలున్నప్పటికి తాజాగా టీఆర్ఎస్ ఓటమికి అతగాడే కారణమన్న వాదన తెరపైకి వచ్చింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సూర్యాపేటకు చెందిన బండారు నాగరాజు టీఆర్ఎస్‌కు విజయాన్ని దక్కకుండా చేశాడన్న ప్రచారం జరుగుతుంది. ఈ ఉప ఎన్నికలో ఆయనకు రోటీ మేకర్‌ను ఎన్నికల గుర్తుగా ఇచ్చారు. అయితే అది అచ్చం కారు గుర్తును పోలీ ఉండడంతో కొందరు కన్‌ఫ్యూజ్ అయి టీఆర్ఎస్‌కు వేయాల్సిన ఓటు బండారు నాగరాజుకు వేశారని అంటున్నారు.

అయితే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ తర్వాత స్వతంత్ర అభ్యర్థి నాగరాజు నాలుగో స్థానంలో నిలిచాడు. ఎన్నిక బరిలో నిలిచిన సుమారు 15 మంది స్వతంత్ర అభ్యర్థులకు కలిపి మొత్తం 2000 ఓట్లు మాత్రమే వస్తే ఒక్క నాగరాజుకే 3570 ఓట్లు వచ్చాయి. అంతేకాదు బ్యాలట్ ఓట్లలో కూడా నాగరాజుకు 60 ఓట్లు వచ్చాయంటే మామూలు విషయం కాదు. అయితే నాగరాజుకు వచ్చిన ఓట్లు విజయంపై ప్రభావం చూపాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది కూడా టీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం అయ్యి ఉండొచ్చని కొందరు అంటున్నారు.