తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్.. బీజేపీలో చేరనున్న కీలక నేత..!

Friday, December 11th, 2020, 05:01:15 PM IST

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలతో ఫుల్ జోష్‌లో ఉన్న బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు మరింత పదను పెడుతోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నేతలను బీజేపీ టార్గెట్ చేస్తూ పావులు కదుపుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న నేతలను ఒక్కొక్కరిగా బీజేపీలో చేర్చుకుంటుంది. ఈ నేపధ్యంలో మాజీ మంత్రి డా.ఎ.చంద్రశేఖర్ బీజేపీలోకి చేరుతున్నట్టు తెలుస్తుంది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇప్పటికే చంద్రశేఖర్‌తో సంప్రదింపులు జరిపారని, బీజేపీలో చేరేందుకు ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే త్వరలోనే బీజేపీ పెద్దల స‌మ‌క్షంలో వికారాబాద్‌లో భారీ బ‌హిరంగ స‌భ పెట్టి ఆయన పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే గతంలో సీఎం కేసీఆర్‌తో సత్సంబంధాలు కలిగిన చంద్రశేఖర్‌ ఒక సమయంలో టీఆర్‌ఎస్‌లో కీలక నేతగా ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడుని చేస్తామని వికారాబాద్‌లో కేసీఆర్‌ ప్రకటించడంతో చంద్రశేఖరే సీఎం అవుతారని అంతా అనుకున్నారు. ఆ తర్వాత కాలంలో పార్టీలో జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో మంత్రిగాను పనిచేసిన చంద్రశేఖర్ 2019 ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఇక ఈయనతో పాటు కాంగ్రెస్‌కు చెందిన మరో సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది.