కాంగ్రెస్ పార్టీకి మరో షాక్.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా..!

Monday, March 15th, 2021, 07:34:08 PM IST

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకీ మరో షాక్ తగిలింది. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలోకి వెళ్తున్నట్టు తన అనుచరులకు కొండా ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో దిగిన చిన్నారెడ్డికి నష్టం జరగకుండా ఉండాలని ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకున్నానని కొండా చెప్పినట్టు సమాచారం. అయితే రేవంత్, ఉత్తమ్ వంటి పలువురు కాంగ్రెస్ నేతలు కొండాను బుజ్జగించడానికి ప్రయత్నించినా తన నిర్ణయాన్ని మార్చుకునే ఉద్దేశం లేదని చెప్పినట్టు తెలుస్తుంది.

అయితే బీజేపీ వైపు కొండా చూస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ఊహాగానాలకు నేటితో తెరపడింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా చేవెళ్ల నుంచి గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అధికార పార్టీ టీఆర్ఎస్పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించే కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.