టీడీపీకి మరో బిగ్ షాక్.. పార్టీనీ వీడిన కీలక నేత..!

Saturday, January 30th, 2021, 11:00:05 PM IST

TDP_1706
ఏపీలో పంచాయితీ ఎన్నికలకు ముందు టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. విజయనగరం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత పడాల అరుణ టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి పంపారు. ముందు నుంచి టీడీపీలోనే ఉంటూ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పడాల అరుణ గత కొంతకాలంగా అధిష్టానం తీరుపై ఆమె అసంతృప్తిగా ఉంది. పార్టీ కార్యక్రమాలకు, సమావేశాలకు దూరంగా ఉంటున్నారు.

అయితే పార్టీలో తనకు గుర్తింపు దక్కన్నందునే పార్టీ వీడుతున్నట్లు పడాల అరుణ చెప్పుకొచ్చారు. అధికారంలో లేకపోయినా తాను పార్టీకి విధేయురాలిగా పనిచేశానని కానీ పార్టీ పదవుల్లో నాకు ప్రాధాన్యత కల్పించలేదని ఆరోపించారు. పార్టీ తనను పూర్తిగా మర్చిపోయిందని, కనీసం ముఖ్యమైన సమావేశాలకు కూడా నన్ను ఆహ్వానించడం లేదని ఆమె వాపోయారు. 33 ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నందుకు నాకు తగిన బుద్ధి చెప్పారని అందుకే తాను టీడీపీకి రాజీనామా చేసినట్టు చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే త్వరలో పడాల అరుణ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి భేటీ అయి చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. అయితే కార్యకర్తలు, అనుచరులతో మాట్లాడిన తర్వాతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని అరుణ చెప్పుకొచ్చారు.