టీడీపీకి మరో షాక్.. వైసీపీలో చేరబోతున్న మాజీ మంత్రి..!

Thursday, January 28th, 2021, 04:51:39 PM IST

ఏపీలో స్థానిక ఎన్నికలకు ముందు టీడీపీకి షాక్ తగిలేలా కనిపిస్తుంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరబోతున్నట్టు తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న పితాని సత్యనారాయణ పార్టీ మారేందుకు రెడీ అయ్యారని, వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ముచిక్కాల గ్రామానికి చెందిన పితాని సత్యనారాయణ మొదట కాంగ్రెస్ పార్టీలో ఉండగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014 సంవత్సరంలో టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి చంద్రబాబు కేబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఆచంట నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథ రాజుపై ఓటమి పాలయ్యారు. చెరుకువాడ శ్రీరంగనాథ రాజుకు జగన్ కేబినెట్‌లో మంత్రిపదవి లభించింది. ఆచంటలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీరంగనాథ రాజు ఉండడంతో తనకు పాలకొల్లు టికెట్ ఇవ్వాలని పితాని సత్యనారాయణ వైసీపీ అధిష్టానాన్ని కోరుతున్నట్టు తెలుస్తుంది. అయితే జగన్ నుంచి టికెట్ మీద స్పష్టమైన హామీ లభించిన వెంటనే పితాని సత్యనారాయణ వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.